- కింది స్థాయి ఉద్యోగుల చేతివాటంతో ఒకరి డిజిటల్ సైన్ మరొకరి వినియోగం
- ఉన్నతాధికారులకు, పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు
తెలంగాణఅక్షరం-వీణవంక
ఆయనో మండల మెజిస్ర్టేట్.. మండలం మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఏ చిన్న విషయం నుండి మొదలు మండలం మొత్తం భూమి, సర్టిఫికెట్లు ఇతరత్రా పనులు ఆయనే చేయాల్సి ఉంటుంది. ఆయనకు వచ్చే ప్రతీ దరఖాస్తు స్వయంగా పరిశీలించిన తర్వాతే ఆయన డిజిటల్ సైన్ చేసి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన ప్రమేయం లేకుండా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో డిజిటల్ సైన్ వేరే ఉద్యోగులు వేసి సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిసింది. దీంతో తహసీల్దార్ స్థానిక పోలీసు స్టేషన్ తో పాటు కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఒక్క డిజిటల్ సైన్ దొంగిలించి సర్టిఫికెట్ జారీ చేశారా.. లేక మరెన్ని అర్హత లేని సర్టిఫికెట్లు జారీ అయ్యాయో తెలియిని పరిస్థితి నెలకొంది.
- డిజిటల్ సంతకం దోపిడీ
వీణవంక తహసీల్దార్ కార్యాలయంలో నిత్యం అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఏకంగా ధరణిలో అధికారుల చేతివాటం అంటూ రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఓ యువ రైతు అప్పని హరీష్ వర్మ ఏకంగా అడిషనల్ కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అప్పుడు అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించి దాన్ని అంతటితోనే ఆపేశారు. అప్పుడు కేవలం డబ్బులు చేతిమార్పిడే అని అనుకున్నారు. కానీ నేడు డిజిటల్ సంతకాన్నే ఏకంగా దోపిడి చేసి చీటింగి పాల్పడే స్థాయికి అధికారులు దిగజారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబ పెద్ద చనిపోగా ఆ కుటుంబంలోని వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం నవంబర్ నెలలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానిక తహసీల్దార్ తిరుమల్ రావు విచారణ జరిపి ఆ దరఖాస్తును ఫెండింగ్‌లో ఉంచారు. అయితే మరి కొద్ది రోజులకు ఆ కుటుంబం తహసీల్దార్ కార్యాలయానికి తిరిగితిరిగి కార్యాలయంలోని కింది స్థాయి ఉద్యోగులను కలిసి ఎంతో కొంత నగదు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో సదరు ఉద్యోగులు తహసీల్దార్ లేని సమయంలో తహసీల్దార్ డిజిటల్ సంతకాన్ని దొంగతనం చేసి పెద్ద సార్ గుర్తు పట్టడేమోనని భావించి ఏకంగా కుదుర్చుకున్న మొత్తాన్ని తీసుకుని సర్టిఫికెట్ ను జారీ చేశారు. దీంతో కొద్ది రోజులకు ఆ విషయాన్ని తహసీల్దార్ తిరుమల్ రావు గుర్తించి కింది స్థాయిలో విచారణ జరిపారు. అయితే ధరణి ఆపరేటర్ అరుణ్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఈ కుట్రలో పాలు పంచుకుని తనను చీటింగ్ చేశారని భావించి స్థానిక పోలీస్ స్టేషన్, ఆర్డీవో రాజు, కలెక్టర్ ప్రమేల సత్పతికి ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరిపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ కోరుతున్నారు.
- తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది..
తహసీల్దార్ కార్యాలయంలో ప్రతీ ఫైల్ ముందుకు కదలాలంటే అమ్యామ్యాలు ముట్టందే ఫైల్ ముందుకు కదలదనే ఆరోపణలు ఉన్నాయి. కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు రెవెన్యూ కార్యాలయం ద్వారా ఇచ్చే ప్రతీ సర్టిఫికెట్ కు డబ్బులు ఇవ్వందే వచ్చేది లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక రైతులకు భూమిని ట్రాన్సఫర్ చేసేందుకు గత ప్రభుత్వం ధరణి అనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి దానిని పర్యవేక్షించేందుకు తహసీల్దార్‌తో పాటు అతడికి సహకరించేందుకు ఓ ప్రత్యేక ఆపరేటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. అయితే దీంతో ఆ ఆపరేటర్ ను అధికారులు నమ్ముతూ అతడి వద్దే డిజిటల్ కీ ని ఉంచి పనులను పూర్తి చేస్తున్నారు. దీంతో ఆ ఆపరేటర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తూ దొంగ సర్టిఫికెట్ల జారీ వరకూ అమ్యామ్యాలు ముట్టందే ఫైలు ముందుకు కదలడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆ ఆపరేటర్లు చేసిన సంఘటనలే అధికారుల్లో పంపకాలల్లో తేడా ఉండడంతో వారి మధ్య గ్యాప్ పెంచుతున్నాయనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.