తెలంగాణఅక్షరం-కొత్తగూడెం
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం అధికారులు తమ విధులను కూడ నిర్వహించలేని స్థితిలో ఉన్నారా అంటూ ఏజెన్సీ పరిరక్షణ కమిటీ సభ్యులు స్థానిక మండల పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని బడబాబులు మూడు, నాలుగు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు ఎటువంటి పర్మిషన్ లేదు. పంచాయతీ అధికారుల పర్మిషన్ అసలే లేకపోవడం గమనార్హం. మరి పంచాయతీ అధికారుల పర్మిషన్ లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే దీని వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ అధికారులు బహుళ అంతస్తులు నిర్మించవద్దని ప్రభుత్వం నుంచి నోటీసులు పంపించినా అక్రమ నిర్మాణ పనులు కంటిన్యూ చేస్తున్నారని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో చెపుతున్నారు. మండలంలో అనుమతి లేకుండా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శులు నోటీసులు పంపిస్తున్నారు. నోటీసులు అందుకున్న అక్రమ నిర్మాణదారులకు మండల పంచాయతీ అధికారులు అండగా ఉంటున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే.. ఏజెన్సీ ప్రాంతంలో పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాల నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అంటూ గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలను బడాబాబులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సర్పంచ్ నుంచి మొదలు మండల స్థాయి అధికారుల వరకు వారికి భారీగా ముడుపులు చేరుతున్నాయంటూ ఏజెన్సీ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే అక్రమ నిర్మాణాలను అధికారులు పట్టించుకోవడంలేదనే టాక్ వినిపిస్తోంది. మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులు బడాబాబుల కొమ్ము కాస్తున్న కారణంతో పంచాయతీ కార్యదర్శులు కేవలం నోటీసులు ఇవ్వడం తప్ప ఇంకేటువంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేక పోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమాలను, దందాలను అడ్డుకోవాల్సిన అధికారులే ఇలా ముడుపులకు అలవాటు పడితే వాటికి అడ్డుకట్టు వేసేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. అటు లక్ష్మిదేవిపల్లి పంచాయతీ ఆఫీస్ కు ఇటు లక్ష్మిదేవిపల్లి ఎంపీడీఓ ఆఫీస్ కు మధ్యలో అనుమతి లేకుండా పాత బిల్డింగ్ పైనే బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుంటే పట్టించుకోకుండా ఎంపీఓ ఎం చేస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది…
Please follow and like us: