రెండో భర్త వేధింపులే కారణం..?
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
తెలంగాణఅక్షరం-వీణవంక
రెండో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని బేతిగల్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన ఇడుమాల వెంకటలక్ష్మి కూతురు తిరుపకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే వీరి కుటుంబం కొంత కాలం పాటు సజావుగా సాగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. కొంత కాలానికి భార్యభర్తల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వీరు విడిపోయారు. కొంత కాలంపాటు బేతిగల్ గ్రామంలోనే తల్లిదం్రడుల వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆకుల రాములుతో వెళ్లిపోయి అతడి వద్దే ఉంటోంది. ఈ అతడితో సహజీవనం కొనసాగించగా మరో కుమారుడికి జన్మినిచ్చింది. అయితే వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగగా రాములు తాగుడుకు బానిస కావడంతో వీరి మధ్య గొడవలు సాగాయి. అంతేకాక తిరుపపై అనుమానం పెరగడంతో పాటు తాగుడుకు డబ్బులు ఇవ్వాలని పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడు. ఆ బాధలు భరించలేక తిరుప గత 12 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. గమనించిన రాములు చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ విషయం చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు తెలియడంతో వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.