నీరుగారనున్న లక్ష్యం… ”దూరం” కానున్న అంగన్వాడీ సేవలు!

  • కేంద్రాల తరలింపుపై అధికార యంత్రాంగం చర్యలు
  • గగనకుసుమంగా అందుబాటులో ప్రభుత్వ భవనాలు
  • లబ్ధిదారులకు సేవలు అందటంపై అనుమానాలు
  • గర్భిణీలు, బాలింతలు పోషకాహారానికి దూరమయ్యే అవకాశాలు
  • ఖర్చుల తగ్గింపుకోసం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపాటు

తెలంగాణఅక్షరం-కరీంనగర్‌

అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నీరుగారనున్నదా.. అంటే అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చటం పేర ఇతర ప్రాంతాలకు తరలించటమే ఇందుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామంటూ ప్రకటనలు చేస్తూనే, మరోవైపు వాటిని మార్చుతుండటం నిర్వీర్యం చేసే యత్నాల్లో భాగమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వంత భవనాల నిర్మాణం కోసలు నిధులు విడుదల చేస్తున్నామంటూనే, వాటి సేవలు మరింత దూరం చేస్తుండటం పేదల పట్ల పాలకులు అనుసరిస్తున్న తీరు తేటతెల్లమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దశాబ్దాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ కేంద్రాలను వారినుంచి క్రమంగా దూరం చేసేందుకే తరలిస్తున్నారనే ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. పోషకాహార లోపాన్ని అధిగమించి రోగాల బారిన పడుతున్న నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దటంలో క్రియాశీలకంగా ఈ కేంద్రాలు వ్యవహరిస్తుండగా, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఇక నుంచి వీటి సేవలు అందుకోవటం కష్టసాధ్యమేననే ఆందోళన లబ్దిదారుల్లో నెలకొంటున్నది. పౌష్టికాహార పంపిణీతో పాటు చిన్నారులకు పూర్య ప్రాథమిక విద్యనందిస్తూ, పలు ప్రభుత్వ పధకాల అమలులో కీలకంగా మారిన అంగన్వాడీ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. అద్దెభారంతో ప్రస్తుతం వీటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చుతున్నారు.

చాలాచోట్ల ప్రభుత్వ భవనాలు లేక వీటిని ప్రభుత్వ పాఠశాలల్లోకి మార్చాలంటూ, అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యధికశాతం పాఠశాలలు ఊరి పొలిమేరల్లో ఉండగా, కేంద్రాలు వాటిలోకి మార్చితే అంగన్ వాడి సేవలు అందుకోవటంపై లబ్ధిదారులు నిరాసక్తత ప్రదర్శించే అవకాశాలుంటాయని అంగన్ వాడీ సిబ్బందే పేర్కొంటున్నారు. ఎక్కువ మంది లబ్దిదారులు ఉండే ప్రాంతాల్లో మాత్రమే అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా ఉండగా, అందుకు భిన్నంగా వీటిని తరలిస్తుండటం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇన్నాళ్ళు అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము కేంద్రాలకు వెళ్ళి అంగన్వాడీ టీచర్, ఆయాల వద్దకెళ్లి తమ సమస్యలు చెప్పుకునే వారమని ఇకముందు తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి వస్తున్నాయి.
నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు.. 777 అంగన్‌వాడీ కేంద్రాలు..
జిల్లాలో నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టులుండగా, వాటి పరిధిలో 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 296 ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతుండగా, వీటన్నిటినీ ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలో 21 సెంటర్లను ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోకి మార్చారు. కరీంనగర్ అర్బన్ సరిధిలో 113 కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు ఆరింటిని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి, కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు పరిధిలో 34 కేంద్రాలకు 5, గంగాధర ప్రాజెక్టు పరిధిలో 43 కేంద్రాలకు గాను 6, హుజురాబాద్ పరిధిలో 75 సెంటర్లకు 5 కేంద్రాలు తరలించారు. కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు కసరత్తు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతమున్న కేంద్రాలకు సమీపంలో ప్రభుత్వ భవనాలు లభించటం గగనకుసు మం అవుతుండగా, ఇంకా తరలించాల్సిన మిగతా వాటిని ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువచోట్ల ప్రభుత్వ పాఠశాలలు శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతము అంగన్ వాడీ కేంద్రాలు ఉన్న చోటు నుంచి సుమారు కిలోమీటర్ కు పైగా దూరం ఉండగా, లబ్దిదారులు అంతదూరం వెళ్ళి తమకందించే పౌష్టికాహారం తీసుకోనటం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లబ్దిదారులు ఫోటోలు దిగి యాప్లో అప్లోడ్ చేస్తే తప్ప, వారికి పోషకాహారం అందదు. గిర్బిణీలు, బాలింతలు వారుండే పరిస్థితుల్లో తాము నివసించే ప్రాంతాల నుంచి దూరంగా మార్చిన కేంద్రాలకు వెళ్ళి పౌష్టికాహారం తీసుకోవటం కష్టసాధ్యమైన పని కావటంతో, సెంటర్ల వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి దీంతో, పౌష్టికాహారం అందక వారు ఇబ్బందులు పడుతుండటం అనివార్యమనే వాదన వస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ ఆరోగ్యాల పాలిట యమపాశంలా మారుతోందని లబ్దిదారులు మండిపడుతున్నారు.

గతంలో కూడా వీటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చే ప్రయత్నం చేయగా, ఆయా ప్రాంతాల్లోని లబ్దిదారులు, స్థానిక ప్రజల ఆందోళనలతో తరలింపును విరమించుకున్నారు. అయితే, ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో నైనా వీటిని తరలించాల్సిందేననే తలంపుతో ఉన్నట్లుగా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు స్పష్టం చేస్తుండగా, కేంద్రాలకు వెళ్ళే చిన్నారుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గటం తథ్యమనే భావన వ్యక్తమవుతోంది. పాలకులు చేస్తున్న వృధా ఖర్చులతో పోల్చితే అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లింపు పెద్ద భారమేమి కాదని, వెంటనే తరలింపు ప్రక్రియను నిలిపివేసి, యధావిధిగా కేంద్రాలు నిర్వహిస్తేనే అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నెరవేరుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *