తెలంగాణ అక్షరం-వీణవంక
గొర్రెలు, మేకల పంపకందారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 9న తెలంగాణ పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పిల్లి రవియాదవ్ తెలిపారు. మండలంలోని చల్లూరు గ్రామంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం సబ్సిడితో అందిస్తున్న గొర్రెల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తొందని మండిపడ్డారు. జిల్లాలో సుమారు 10 వేల యూనిట్లు పంపిణీ చేయనుండగా కేవలం 600 యూనిట్లు మాత్రమే పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు. ఇప్పటికే 10 వేల మంది రూ.3800 డీడీలు చెల్లించారని, ప్రభుత్వం స్పందించి వెంటనే మిగతా వారందరికీ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా అందరికీ నగదు బదిలీ పథకం ద్వారా అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుంపుల సంపత్, గుంపుల రాజేందర్, బండి శంకర్, గుంపుల శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.