ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హై టెన్షన్
కొనసాగుతున్న ఈడీ సోదాలు..
భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
(తెలంగాణ అక్షరం, ఢిల్లీ బ్యూరో)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సోదాల సందర్భంగా ఇంట్లో ఉన్న అందరి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కవిత వాంగ్మూలం నమోదు చేశారు. అంతకుముందు దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ కన్వీనర్ సోమ భరత్, లాయర్లు కవిత నివాసానికి చేరుకోగా, అధికారులు ఆమె ఇంట్లోకి ఎవరినీ అనుమతించ లేదు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కవిత నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
కవిత అరెస్ట్..?
ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు తనిఖీల అనంతరం కవితకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినట్లు వార్తలు గుప్పుమనడంతో.. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, మహిళ నేతలు తరలివచ్చారు. దీంతో కవిత నివాసం సమీపంలో కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లిపోతోంది. ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ, ఎన్ ఫోర్స్ మెంట్ దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోశ్కుమార్, ప్రశాంత్ రెడ్డిలు ఆయనతో భేటీ అయ్యారు. కవిత అరెస్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ప్రధాని మోడీ రాష్ట్రంలో ఉండగానే కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం సాగుతోంది.