సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లి..
వడదెబ్బతో మహిళ మృతి
కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు
తెలంగాణఅక్షరం-వీణవంక
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కరీంనగర్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా నిర్వహించిన జనజాతర సభలో అపశృతి చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వెళ్ళిన వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మంగళవారం వడదెబ్బతో మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కాగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన జనజాతర సభకు గ్రామం నుండి ట్రాక్టర్ల ద్వారా గ్రామస్తులు తరలివెళ్లారు. కాగా గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ సీఎం సభ ముగియగానే ఇంటికి వెళ్లేందుకు ట్రాక్టర్ దగ్గరకు వెళ్తుండగా వడదెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన స్థానికులు ఆమెను సభ పక్కనే ఉన్న ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లే లోపు మృతి చెందింది. ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతురాలి పెద్ద కుమారుడు రాజు గతంలో అనారోగ్యంతో మృతి చెందగా భర్త మధునయ్య, కుమారుడు విరాట్ ఉన్నారు.