2.2 లక్షల, బంగారం, వెండీ తస్కరణ
పశ్చిమ బెంగాల్ లో నిందితుల అరెస్ట్..
తెలంగాణఅక్షరం-హైదరాబాద్
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఉన్న భట్టి విక్రమార్క నివాసంలో.. దొంగలు పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి.. లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు. అయితే.. ఇంట్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భట్టి నివాసానికి చేరుకుని అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో చోరీకి సంబంధించిన వీడియోలు రికార్డవగా.. ఆ దృశ్యాల్లో ఉన్న దుండగులు బిహార్‌కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విదేశాల్లో ఉన్న భట్టి విక్రమార్కకు ఈ దొంగతనం విషయం తెలియడంతో.. ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఆ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే.. చోరీకి పాల్పడిన దొంగలు పశ్చిమ బెంగాల్‌లో పోలీసులకు దొరికిపోయారు. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము దొంగలమని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసి పారిపోతున్నట్టు తెలిపగా ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. నిందితుల వద్ద రూ.2.2 లక్షల నగదుతో పాటు 100 గ్రాముల బంగారు నాణెం, కొంత విదేశీ కరెన్సీ నోట్లు, పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. విచారణ అనంతరం తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా ఆ పోలీస్ స్టేషన్‌లో ఈ చోరీ ఘటనకు సంబంధించి నిందితుడు రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్ కోర్టులో హాజరుపరచనున్నారు.