తెలంగాణ అక్షరం-వీణవంక
విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందిన సంఘటన వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన దాట్ల మల్లయ్య ఇటీవల రూ.70వేలు వెచ్చించి వ్యవసాయం కోసం ఎద్దును కొనుగోలు చేశాడు. కాగా ఎప్పటిలాగానే మేతకోసం పొలం వద్దకు తీసుకెళ్లి వదిలాడు. మేత మేసుకుంటూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అక్కడున్న తీగలకు తగలి ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడకక్కడే మృతి చెందింది. దీంతో రైతు కుటుంబం బోరున విలపించింది. విద్యుత్ అధికారులకు గతంలో ఇక్కడ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని విన్నవించినా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని, విద్యుత్ అధికారులు నష్టపరిహారం చెల్లించి తనను ఆదుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కొండపాక రైతుల డిమాండ్ చేస్తున్నారు.