జిల్లా వ్యాప్తంగా భారీగా వసూళ్లు..
పట్టించుకోని ఈడీఎం, అధికారులు
ఈడీఎంను మార్చాలని ప్రజల డిమాండ్
తెలంగాణ అక్షరం-వీణవంక
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీ సేవ సెంటర్లలో వసూళ్ల పర్వం సాగుతోంది. ఈడీఎం, డీఎంతో పాటు తహసీల్దార్లు పట్టించుకోకపోవడంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు సెంటర్లంటే నిర్వాహకుల ఇష్టారాజ్యం అనుకోవచ్చు.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగుతుందటే ఖచ్చితంగా అధికారుల వైఫల్యమే కారణమని అంటున్నారు. మీ సేవ సెంటర్లలో తనిఖీలు చేసిన అధికారులు.. మళ్లీ అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే ఇలా భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రాజీవ్ యువశక్తి పథకానికి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించడం.. మీ సేవ సెంటర్లకు కాసులు కురిపిస్తోంది. దరఖాస్తుతో పాటు ఆదాయం సర్టిఫికెటు కావాల్సి ఉండడంతో వసూళ్లకు తెగించారు. దీనికి తోడు మీ సేవ సెంటర్ల నిర్వాహకులకు తహసీల్దార్ కార్యాలయంలోని పలువురి సిబ్బంది నుంచి కూడా సహకారం ఉండడంతో వీరి వసూళ్లకు కలిసివస్తోంది. ఈడీఎం, డీఎంతో పాటు అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.