తెలంగాణ అక్షరం – బాలాపూర్
బడంగ్పేట్ మున్సిపల్ అక్రమాలపై అధికారులు స్పందించడం లేదంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఉప్పలమ్మ తల్లికి వినతిపత్రం సమర్పించి వినూత్న నిరసన తెలిపారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలుపుతూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ, బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, రోడ్లు, నాలాలు, పార్కుల స్థలాలు అక్రమంగా ఆక్రమించబడి ఉన్నాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల వీటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. శివ సాయి నగర్ డ్రైనేజ్ సమస్య కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైనా పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఎంసిఆర్ కాలనీలో రోడ్డు కబ్జాకు గురై ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి వ్యాపార గదులు నిర్మించబడిన ఘటనపై రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్, బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్, హైడ్రా జోన్ కమిషనర్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అనేక ఫిర్యాదులు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, ప్రజల్లో ఉన్న నమ్మకం ప్రకారం, సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఎం.సి.ఆర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన ఆ రోడ్డు పైకప్పును గాలి రూపంలో తొలగించాడని భావిస్తున్నారన్నారు. ఇది అధికారాల వైఫల్యానికి దేవుడిచ్చిన హెచ్చరికగా ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నడికూడ యాదగిరి, చెరుకుపల్లి వెంకట రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, రేసు నరసింహ రెడ్డి, కుంటి భాస్కర్, తీగల సురేందర్ రెడ్డి, అగ్రిసెట్టి సైదులు, బంగారు రాజకుమార్, ప్రభాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, జి మల్లేష్, ప్రవీణ్ గౌడ్, మహేందర్, బాపనయ్య, వివిధ కాలనీల ప్రజలు కూడా పాల్గొన్నారు.