- 27న గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలి
- బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు
వీణవంక :ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండులా తరలిరావాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాల కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని వీణవంక వాగు, మానేరు వాగు చెక్ డ్యాంలు నిర్మించి రైతులకు పుష్కలంగా నీరు అందించిన ఘనత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని కొనియాడారు.
రాష్ట్ర సాధన ఉద్యమ పార్టీగా, పదేండ్లు అధికార పార్టీగా, 17 నెలలు ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రజతోత్సవ సభకు తరలివెళ్లడానికి సుమారు 100 బస్లు ఏర్పాటు చేస్తున్నట్లు, పార్టీ శ్రేణులు 27న గ్రామగ్రామాన బీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.
తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ రజతోత్సవ సభకు మండలం నుండి 6 వేలకు పైగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జ్యోతి రమేష్, మాజీ ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భానుచందర్, వీణవంక టౌన్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి మహేష్, కృష్ణ చైతన్య, ఓరెం మధు, శ్రీకాంత్, సురేష్, శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.