- టీడబ్ల్యూజేఎఫ్ పాత్రికేయుల పక్షాన పోరాడుతుంది
- రాష్ట్రవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలి
- రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
- హన్మకొండ,వరంగల్ జిల్లాల్లో భారీగా సభ్యత్వ నమోదు
- ఫెడరేషన్ లో చేరిన ఇతర యూనియన్ నేతలు
తెలంగాణఅక్షరం-హన్మకొండ
రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. జర్నలిస్టులకు అండగా ఉండేందుకు ఏర్పడిన ఏకైక ట్రేడ్ యూనియన్ ఇదే అని అన్నారు. రాష్ట్రవ్యాపితంగా జరుగుతున్న ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. గురువారం హన్మకొండ లోని టీజీవో భవన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ హన్మకొండ, వరంగల్ జిల్లాల సభ్యత్వ నమోదు కార్యక్రమం, వివిధ యూనియన్ ల నాయకుల చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని, ఒకవైపు యాజమాన్యాలు,
ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం, మరోవైపు దాడులు, అవమానాలు పెరిగిపోవడం జరుగుతుందని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు శిక్షణతో కూడిన వృత్తినైపుణ్యతను పెంపొందించుకొని విధినిర్వహణలో సమర్ధవంతంగా, సమిష్టిగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రధాన జర్నలిస్టు యూనియన్లు జర్నలిస్టుల పక్షం కాకుండా పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం పాలకుల పక్షాన కాకుండా కేవలం పాత్రికేయుల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతుందని మామిడి సోమయ్య స్పష్టం చేశారు. ఈ సంఘంలో ఉన్న పాత్రికేయులు కూడా ప్రజల పక్షం ఉండాలని, ప్రజల సమస్యలపై స్పందించాలని కోరారు. పదవుల కోసం, పైరవీల కోసం పాలకుల కొమ్ముకాస్తూ జర్నలిస్టుల సంక్షేమాన్ని, సమస్యలను విస్తరిస్తున్న పాత్రికేయ సంఘాలను పాతరేసే సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రభుత్వాల పక్షాన నిలిచి జర్నలిస్టులకు కనీసం ఇండ్ల స్థలాలు, పెన్షన్ సదుపాయం, చనిపోయిన జర్నలిస్టులకు తగిన ఆర్థిక సహాయం ఇప్పించలేక పోయిన సంఘాలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించాయని, గత బీఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు తగ్గింపు, ఇండ్ల స్థలాలు వంటి సమస్యలు పరిష్కరించాల్సి వుందని అన్నారు. హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఫెడరేషన్ నిర్వహించబోయే ఉద్యమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫెడరేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు టీవీ రాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, వల్లాల జగన్, రాజశేఖర్, కార్యదర్శులు దయాసాగర్, చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జక్కుల విజయ్ కుమార్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుడుతాడి బాపురావు, హన్మకొండ జిల్లా కార్యదర్శి గోపాల్, వరంగల్ జిల్లా కార్యదర్శి స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ లోకి టీయూడబ్ల్యూజే సంఘం జర్నలిస్టులు
హన్మకొండ,వరంగల్ జిల్లాలకు చెందిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే-143) యూనియన్ కు చెందిన దాదాపు వంద మంది నాయకులు, జర్నలిస్టులు టీడబ్ల్యూజేఎఫ్ లో చేరారు. టీయూడబ్ల్యూజే అనుబంద చిన్న పత్రికల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు అంతడుపుల శ్రీనివాస్ తో పాటు ఆ సంఘానికి చెందిన దాదాపు యాభై మంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టు దామెర రాజేందర్ తో పాటు వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు ఫెడరేషన్ లో చేరారు. వీరందరికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సభ్యత్వం ఇచ్చి సంఘంలోకి ఆహ్వానించారు.