- 2914 మంది విద్యార్థుల హాజరు.. 61 మంది విద్యార్థులు గైర్హాజర్..
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నీట్ పరీక్ష కేంద్రాల సందర్శన
తెలంగాణఅక్షరం-కరీంనగర్
జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించామని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ బైపాస్ రోడ్ లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో నీటి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆయా చోట్ల ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.. ఏర్పాట్లు పకడ్బందీగా చేశారా.. ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా… పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారా… అని అధికారుల నుంచి కలెక్టర్ వివరాలు సేకరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ చేపట్టిన ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గదుల్లోకి వెళ్లి పరీక్ష తీరు.. వసతుల కల్పనను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షకు ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 2975 మందికి 2914 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారని, 61 మంది విద్యార్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఈ మేరకు పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరిగిందని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. కలెక్టర్ వెంట నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, ఎస్ ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, తహసిల్దార్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలన ..
అదేవిధంగా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వివిధ నీట్ పరీక్ష కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా వసతుల కల్పన.. విద్యార్థుల హాజరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. అన్ని వివరాలను తెలుసుకున్నారు. పోలీసుల భద్రత..విద్యార్థుల బయోమెట్రిక్, తనిఖీలు.. వివిధ అంశాలను కనుక్కున్నారు. ఎక్కడా ఏలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు అడిషనల్ కలెక్టర్ సూచించారు. నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా సాగిందని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు.