- కరీంనగర్ జిల్లాలో నాలుగు కుటుంబాలకు లబ్ధి
- కృతజ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఐజేయూ జిల్లా శాఖ
తెలంగాణఅక్షరం-కరీంనగర్
విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యాల గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం చెక్కుల పంపిణీ చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన చనిపోయిన జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1లక్ష ఆర్థిక సాయంతో పాటు ఐదు సంవత్సరాల పాటు రూ.3వేలు పింఛన్, పదో తరగతి లోపు చదివే పిల్లలకు ఉంటే రూ.1000, శాశ్వత అంగవైకల్యం పొందిన జర్నలిస్టులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని త్వరలో అక్రిడిటేషన్ కార్డుల తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి జిల్లా కలెక్టర్ లకు అదేశాలు జారీ చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో మృతి చెందిన నలుగురికి జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యాల గురైన నలుగురు జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.
జర్నలిస్టులకు అండగా ఐజేయూ
ఇటీవల మరణించిన పత్తి విష్ణువర్ధన్ రెడ్డి, అన్నేపాక సురేందర్, బాణాల శ్యాంసుందర్, ముజాహిద్ ఖాన్ కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన జి ఉదయకుమార్, పత్తి కొండాల్ రెడ్డి, ఉమ్మడి రాజేష్, జడల చిరంజీవికి రూ. లక్ష చొప్పున సాయం అందజేశారు. కాగా వీరికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా శాఖ అండగా నిలిచింది. తెలంగాణ మీడియా అకాడమీ నుండి అందించే ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాల చేత టీయూడబ్ల్యూజే దరఖాస్తులు సమర్పించింది. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణలతో పాటు ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కానని రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.