తెలంగాణఅక్షరం-పెద్దపల్లి
జిల్లాలో విత్తనాల డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు వికయిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో విత్తనాల విక్రయంలో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, రాష్ర్ట విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం సాగుకు అవసరం అయ్యే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పంటకు అవసరమైన ఎరువులు, డీఏపీ స్టాక్ వివరాలను ఈ పాస్ యంత్రాల్లో అప్ డేట్ చేయాలని ఆదేశించారు. విత్తనాల బ్యాగ్‌పై లేబుల్, నిల్వ, చివరి గడుపు, తేదీ వివరాలను రైతులకు స్పష్టంగా వివరించాలని, విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్లు, రిటైలర్లు మాత్రమే విక్రయించాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ పరిధిలో ఎవరైనా అనధికారంగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే సంబంధిత డీలర్ల నుంచి రైతులకు నష్టపరిహారం అంచనా వేసి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ర్ట విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నేరుగా రాష్ర్ట విత్తన అభివృద్ధి సంస్థ నుంచి నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఊరు పేరు లేని విత్తనాలు విక్రయించటానికి వీలు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలో తయారు చేసిన విత్తనం బాగా ఉందని, సన్న, దొడ్డు రకం ధాన్యం విత్తనాల అందుబాటులో ఉన్నాయన్నారు.
పెద్దపల్లి జిల్లాలో కనీసం పదివేల క్వింటాళ్లు ప్రభుత్వ రంగ విత్తనాలు అమ్మాలని డీలర్లకు సూచించారు. సమావేశంలో రాష్ర్ట విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి, డీఏవో దోమ ఆదిరెడ్డి, వ్యవసాయ, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.