- కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకుంటే ఆందోళన చేస్తాం
- భారతీయ జనతా పార్టీ హెచ్చరిక
తెలంగాణఅక్షరం, బాలాపూర్
బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కమిషనర్ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పనులు నాణ్యతగా జరగకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బడంగ్పేట్ భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం బిజెపి నాయకులు సమావేశంలో మాట్లాడుతూ, కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతుందని, టెండర్లను గోపియంగా ఉంచి అధికార పార్టీ నాయకులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు వేసిన టెండర్లు గోప్యంగా ఉంచకుండా బహిరంగపరచాలని అన్నారు.
అధికార పార్టీ రాజకీయ నాయకుల అనుచరులకే టెండర్లు దక్కేలా కమిషనర్ వ్యవహారం దగ్గరుండి చూసుకుంటున్నారని, ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ అధికార పార్టీ నాయకులకు తొత్తుగా మారడం సరియైన పద్దతి కాదని అన్నారు. ఇకనైనా కమిషనర్ పద్ధతి మార్చుకోవాలని పేర్కొన్నారు. కమిషనర్,కాంగ్రెస్ నాయకులు, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కు చెందిన కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగపరుస్తు వారి జేబులు నింపుకుంటుంటే చూస్తూ ఊరుకోమని, లోలోపల టెండర్లు పొంది నాసీరకమైన పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఎక్కడికక్కడ పనులను నిలపి వేసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణ రెడ్డి, వీర కర్ణారెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, బిట్టు, పవన్, సతీష్ నంద, శ్రీనివాస్ చారి, కార్యకర్తలు పాల్గొన్నారు.