రోడ్డున పడ్డ 18 వేల కుటుంబాలు
సాక్షారభారత్ కో ఆర్డినేటర్ల ఆవేదన
మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోని, న్యాయం చేయాలని డిమాండ్
విసిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్
తెలంగాణ అక్షరం-హన్మకొండ:
వయోజన విద్యలో 2010 నుండి 2019 వరకు సాక్షారభారత్ కో ఆర్డినెటర్లుగా దాదాపు 10 సంవత్సరాల పాటు వెట్టిచాకిరి చేయించుకుని మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారని సాక్షారభారత్ గ్రామ కో ఆర్డినేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్ అధ్యక్షతన జరిగిన విసిఓ ల రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ…. సాక్షారభారత్ కో ఆర్డినెటర్లుగా వయోజనులకు విద్య చెప్పడంతో పాటు గ్రామ పంచాయతీలో ఒక జూనియర్ కార్యదర్శి లాగా ఎన్నో పనులను మాతో చేయించుకున్నారని. గ్రామ పంచాయతీలో మాతో పన్నులు వసూలు చేయించడంతో పాటు హరితహారం, రైతు బంధు,భీమా సర్వేలు,స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్లు కొరకు సర్వే, అదనంగా ఎన్నికల నిర్వహణలో బిఎల్ఓ లుగా విధులు నిర్వహించినట్లు తెలిపారు.ఇలా మాతో వెట్టిచాకిరి చేయించుకున్న ప్రభుత్వాలు మమ్మల్ని విస్మరించాయని,ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కెటిఆర్ లు స్పందించి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలాని,లేదా గ్రామ పంచాయతీల్లో గానీ ఏదైనా వేరే డిపార్ట్మెంట్ లో కానీ మమ్మల్ని తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు.
మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకి మా మద్దతు
మా సాక్షారభారత్ కో ఆర్డినెటర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి, మీ మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఈ సందర్బంగా కోరారు.మా సమస్యలను పట్టించుకున్న పార్టీలకు అండగా ఉంటామని ప్రతి గ్రామానికి ఇద్దరు కో ఆర్డినెటర్లం ఉన్నామని,రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మంది ఉన్నామని,మా సత్తా ఏంటో మమ్మల్ని విస్మరించిన పార్టీలకు చూపిస్తామని హెచ్చరించారు.