తెలంగాణ అక్షరం – మంథని, పెద్దపల్లి
కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లామంథని మండలంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు, గ్రామస్థులు భావిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ సంగీతలకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే అశోక్ కుటుంబంలో.. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నట్లు బంధువులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారుజామున చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరు చిన్న పిల్లలు అనాధలు అయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది