-
ఒక్క కొడుకు ఉంటే కీడు … పండుగ వేళ జోరుగా వదంతులు
-
గాజుల దుకాణాల గల్లా పెట్టే గలగల….?
తెలంగాణఅక్షరం-హైదరాబాద్ బ్యూరో
సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందని, ఒక్క కొడుకు ఉన్న మహిళలకు ఈ పండుగ కీడు చేస్తుందనే వదంతులు జోరుగా వ్యాపిస్తున్నాయి. మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు సమాజంలో ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే వదంతులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . ఒక్క కొడుకు ఉన్న మహిళలు వెంటనే ఈ పని చేయాలని లేదంటే వారికి కీడు తప్పదు అంటూ ప్రచారం గ్రామాలలో జోరుగా పాకుతుంది. ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరూ అంతకంటే ఎక్కువ కొడుకులు ఉన్న మహిళల వద్ద నుండి ఎంతో కొంత డబ్బులు తీసుకొని, ఆ డబ్బులతో ఐదు రకాల గాజులను కొనుక్కొని వాటిని ధరించాలని, లేదంటే వారికి కీడు తప్పదు అంటూ అనే వార్త విస్తృతంగా వినపడుతుంది. ఈ విషయం చెవిలో పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలు కంగారుగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కొడుకులు ఉన్న మహిళల వద్ద నుండి డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని పలువురు సామాజిక వ్యక్తులు సూచిస్తున్నారు. ఇటువంటి ప్రచారాలతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప, ఎలాంటి హాని జరగదని విద్యావంతులు కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి గాజుల దుకాణాల గల్లా పెట్టే గలగల అనడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.