నవతెలంగాణ-వీణవంక
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, పీసీసీ సభ్యుడు కర్ర భగవాన్ రెడ్డి, జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య కోరారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో గురువారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల రాజిరెడ్డి (శ్యాంసుందర్ రెడ్డి) అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ బల్మూరి వెంకట్ కే వస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. పార్టీ నాయకులంతా ఏకతాటిపై వెంకట్ గెలుపుకోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కొంత మంది అగ్రనాయకుల వ్యవహారం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని, అలాంటి దానికి ఎవరూ తొందర పడొద్దని సూచించారు. పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు కావాలని గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని, వాటికి ఎవరూ భయపడొద్దని చెప్పారు. రానున్న ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ తప్పని సరిగా అధికారంలోకి వస్తుందని, ప్రతీ ఒక్కరూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డిని శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు గంగాడి రాజిరెడ్డి, కుర్మిండ్ల తిరుపతి, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.