తెలంగాణ అక్షరం-వీణవంక
మండల కేంద్రంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఉపాధి కోల్పోతున్న చిరువ్యాపారుల కోసం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న భూమిలో స్థలం కేటాయిస్తున్నట్లు వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీగా ఉన్న స్థలంలో ఉపాధి కోసం 48 దుకాణాల కోసం తాత్కాలికంగా స్థలం కేటాయిస్తూ బుధవారం ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు వెడల్పలో భాగంగా సుందరీకరణ పనులు జరుగుతున్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఉపాధి కోల్పోకూడదని, వారి కోసం తాత్కాలికంగా స్థలం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మొండయ్య, తాళ్లపల్లి మహేందర్, నాయకులు నీల పున్నం చందర్ , రెడ్డి రాజుల రవి, సుకాసి సురేష్, నీల శ్రీనివాస్, వీర, షాపుల యజమానులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.