టెస్కో రాష్ట్ర డైరెక్టర్ అడిగొప్పుల సత్యనారాయణ
తెలంగాణఅక్షరం-వీణవంక
చేనేత సహకారం సంఘం (సొసైటీ) సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు టెస్కో రాష్ట్ర డైరెక్టర్, కోర్కల్ చేనేత సహకారం సంఘం సొసైటీ అధ్యక్ష పర్సన్ ఇన్చార్జి అడిగొప్పుల సత్యనారాయణ అన్నారు. కోర్కల్ చేనేత సహకారం సంఘం 51వ వార్షిక, 58వ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ సొసైటీ సభ్యులు, అధికారుల సహకారంతో సంఘం లాభాల్లో నడిపేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. సంఘం స్థాపించనప్పటి నుండి 51 సంవత్సరాలుగా చేనేత కార్మికులు కష్టపడుతూ సంఘం లాభాలు ఘటించేందుకు సభ్యుల కృషి, అధికారుల చేయూత మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిప్పటి నుండి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సంఘ సభ్యుల సంక్షేమం కోసం, సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో చేనేతల అభివృద్ధికి ఐఏఎస్ అధికారులు శైలజారామయ్యర్, జ్యోతి బుద్ధ ప్రకాష్, అలుగువర్షిణితో పాటు అధికారులు పూర్తిగా సహకారం అందించారని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ సభ్యులకు లబ్ధి చేకూర్చే విధంగా అన్ని సహకారాలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధిక కేడీసీసీ బ్యాంకు అధికారులు ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నారని, వారికి సభ్యులందరమూ రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తమకు కూలీ రేట్లు పెంచాలని కోరారు. అలాగే యారన్ సభ్సిడీ(చేనేత మిత్రపథకం) ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం వల్ల నష్టపోతున్నామని, పాత పద్ధతినే యథావిధిగా కొనసాగిస్తూ సభ్యులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చొరవ తీసుకునే విధంగా అధికారులు, పాలకవర్గం చొరవ చూపాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లైట్ల పథకాన్ని వెంటనే లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పెండింగ్ లో ఉన్న సభ్యుల సంక్షేమ పథకాలను పరిశీలించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని, నష్టపోకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా సంఘంలో పని చేస్తూ మృతి చెందిన పలువురికి సంతాపం ప్రకటించారు. అనంతరం సభకు హాజరైన అతిథులను శాలువాతో సత్కరించారు. అడిగొప్పుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం సహాయ అభివృద్ధి అధికారి టీ శాంత, జిల్లా చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రామచంద్రం, మాజీ జెడ్పీటీసీ ఆనందం రాజమల్లయ్య, జమ్మికుంట, ఊటూరు, పచ్చునూరు సొసైటీల అధ్యక్షులు రమేష్, శంకరయ్య, పరదేశి, కేడీసీసీ బ్యాంకు అధికారులు సందీప్, ప్రదీప్, పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.