సూపరింటెండెంట్ భాస్కర్ సేవలు మరువలేనివి
ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి
తెలంగాణఅక్షరం -వీణవంక
ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ గాజుల భాస్కర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేపట్టగా ఆయనకు గురువారం ఘనంగా సత్కరించారు. ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ సూపరింటెండెంట్, ఇన్చార్జి ఎంపీడీవోగా భాస్కర్ చేసిన సేవలు గొప్పవని అన్నారు. ఆయన పనిపట్ల నిబద్దతో వ్యవహరిస్తూ తోటి ఉద్యోగస్తులతో సన్నిహితంగా ఉంటూ గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు ఇంకా 12 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా ఉద్యోగ విరమణ చేయడం బాధాకరమని అన్నారు. ఆయన ఎక్కడున్న పేద ప్రజాలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. గాజుల భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగం చేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడం కత్తిమీద సాములాంటిదని అన్నారు. కానీ తాను వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో పుట్టి, సొంత మండలంలో పని చేయడం, ఉద్యోగ విరమణ చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. తాను నిర్వర్తించిన విధులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా తోడ్పాటు నందించిన ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, జర్నలిస్టులు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.