ఎప్పుడు ప్రకటించనున్నారంటే..
_ డిసెంబరు తొలివారంలో పోలింగ్
_వచ్చే నెల 3 నుంచి ఈసీ బృందం పర్యటన
_వీరి నివేదిక ఆధారంగా ఈసీఐ నిర్ణయం
_ఓటర్ల జాబితాపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తి
_అక్టోబరు 4న తుది జాబితా విడుదల
తెలంగాణ అక్షరం-హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు 6న షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది. దాంతో.. ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే.. 2018లో.. డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి. జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీన్ని బట్టి.. 2024 జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువుదీరాలి. అందుకు అనుగుణంగా ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలో షెడ్యూల్ విడుదలవ్వాలి. ఆ తర్వాత.. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు కనీసం రెండు నెలల సమయం అవసరం. మంత్రి కేటీఆర్ కూడా ‘‘అక్టోబరు 10లోపు షెడ్యూల్ విడుదలవ్వాలి. అంతకు మించి ఆలస్యం జరిగితే.. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయి’’ అంటూ ఈ మధ్య ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబరు మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతుంది. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తరఫున రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ప్రత్యేక బృందం రానుంది. అక్టోబరు 3, 4, 5 తేదీల్లో ఈ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది._
_రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి పలు అంశాలను పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక నివేదికను సమర్పించనుంది. ఆ నివేదిక అందిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ తేదీన కుదరకపోతే.. అక్టోబరు 10వ తేదీలోపు షెడ్యూల్‌ను జారీ చేస్తారని భావిస్తున్నారు. షెడ్యూల్ జారీ అయిన నెల తర్వాత నోటిఫికేషన్‌ను విడుదల అవుతుంది. ఆ తర్వాత.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలి. కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి రాష్ట్ర అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశారు. అటు ఓటర్ల జాబితా రెండో సవరణలో భాగంగా అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను మంగళవారం ముగించారు._
_రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 వరకు కొత్త ఓటర్ల నమోదుకు 13.06లక్షల దరఖాస్తులు, పేర్ల తొలగింపునకు 6.26 లక్షల అర్జీలు అందాయి. సవరణలకోసం 7.77 లక్షల దరఖాస్తులు అందినట్లు ఎన్నికల విభాగం అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను ఈనెల 27 లోపు పరిష్కరించి.. అక్టోబరు 4న తుది జాబితాను విడుదల చేస్తారు. గడువు ముగిసినప్పటికీ.. పౌరులు ఎప్పుడైనా దరఖాస్తులు పంపే వెసులుబాటు ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 14.72 లక్షలమంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారని, 18-19 ఏళ్ళ వయసున్న ఓటర్లు జనవరి 5 నాటికి 2.79 లక్షలుండగా, మంగళవారం వరకు 6.51 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. మొత్తం ఓటర్లు 3.13 కోట్లు ఉన్నారని, ఇందులో పురుషుల సంఖ్య 1.57 కోట్లు కాగా.. మహిళల వాటా 1.56 కోట్లు, ఇతరులు 2,226 మంది ఉన్నారు. వివిధ కారణాల వల్ల 3.39 లక్షల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించారు._