డీ గ్రేడ్ లో ఉన్న సొసైటీని ఏ గ్రేడ్ లోకి తీసుకొచ్చాం
పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
డీ గ్రేడ్ లో ఉన్న వీణవంక సొసైటీని తమ పాలకవర్గంలో ఏ గ్రేడ్ లోకి తీసుకొచ్చామని, రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, పాలకవర్గం సహాయ సహకారాలతో సొసైటీని లాభాల్లో నడిపిస్తున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని సొసైటీకి విక్రయిస్తూ లాభాల్లో నడిచే విధంగా తోడ్పాటునందిస్తున్నారని, ఎలాంటి ధాన్యం కటింగ్ లేకుండా రైతుల వద్ద ధాన్యాన్ని నేరుగా కొంటూ వారికి డబ్బులను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సొసైటీ సొంత భవనానికి వీణవంక మండల కేంద్రంలో రూ.4లక్షల80 వేలతో ఆరు గుంటల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీనిలో త్వరలో సొంతబిల్డింగ్ కట్టుకుంటామని చెప్పారు. అలాగే కోర్కల్ గ్రామంలో పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం 30 గుంటల భూమిని విక్రయించామని, ఏమైనా కంపెనీలు వచ్చినట్లయితే వెంటనే పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే మరో 20 ఎకరాల స్థలం సేకరించి మరో రూ.100 కోట్ల ప్రభుత్వ నిధులతో రైస్ మిల్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నామని, ఈ విషయంపై మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారితో చర్చించినట్లు తెలిపారు. అలాగే సుమారు 680 మందికి రుణాలు సొసైటీ ద్వారా అందించగా 389 మందికి రుణమాఫీ అయినట్లు పేర్కొన్నారు. త్వరలో మరో 299 మందికి రుణాలు మాపీ అవుతాయని ప్రకటించారు. రుణాలు మాఫీ అయిన రైతులందరికీ రుణాలు మళ్లీ అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
పీఏసీఎస్ సీఈవోపై సభ్యుల ఆగ్రహం
పీఏసీఎస్ సీఈవో చందుపట్ల ప్రకాశ్ రెడ్డిపై సొసైటీ సభ్యులు రఘునాథ్ రెడ్డి, నర్సింహరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో జరిగిన తీర్మాణాలపై చర్చకు పట్టుబట్టారు. సొసైటీలో గన్నీ సంచుల అవకతవకలపై ప్రశ్నించారు. అలాగే సివిల్ సప్లై వారు రికవరీ చేసిన గన్నీ సంచుల డబ్బులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను చేసిన ఫిర్యాదు ద్వారా తనకు అందిన సమాచారం మేరకు సుమారుగా రూ.37లక్షల మేరకు అవినీతి జరిగినట్లు రఘునాథ్ రెడ్డి అనే సభ్యుడు ఆరోపించారు. కాగా ఈ సమావేశంలో పాలక వర్గ సభ్యులు చెకబండి శ్రీనివాస్ రెడ్డి, గూటం సమ్మిరెడ్డి, రాములు, గెల్లు మల్లయ్య, శ్యాంసుందర్ రెడ్డి, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.