తెలంగాణఅక్షరం -హన్మకొండ :
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన బదిలీపై వెల్తున్న వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాధ్ కు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు సర్వ సాధారణమని అన్నారు. ఈ ఎన్నికల సమయంలో అందరితో కలివిడిగా ఉండే సీపీ రంగనాధ్ బదిలి కావటం కొంత ఇబ్బందిగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు సంబంధించిన డబ్బులు చిట్ ఫండ్ నుండి ఇప్పుంచేందుకు సీపీ చేసిన కృషిని గుర్తుచేశారు. ఈసందర్బంగా ముఖ్యఅతిధిగా హజరైన సీపీ రంగనాధ్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమని, వరంగల్ లో ప్రజలతో, మీడియా తో చాలా సింక్ అయ్యానని చెప్పారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారంలో నేను ప్రజలకు దగ్గరయ్యానని అన్నారు. పేదలకు, బాధితులకు అండగా నిలవాలనే ఐడియాలజీ తో తాను పనిచేస్తానని, బలహీనంగా ఉన్న వాడిని బలవంతుడి నుండి కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లాండ్ ఆర్డర్ లో భాగంగా ఉంటుందన్నారు. ఉదయం 7గంటల నుండి రాత్రి11గంటలు ప్రజల సమస్యలు, అధికారులతో ఫోన్ మాట్లాడిన రోజులు అనేకం ఉన్నాయని, మాభూమి సినిమా చిన్నప్పుడు చూసానని,ఇక్కడికి వచ్చాక మరో 2-3 సార్లు చూసానని గుర్తుచేసుకున్నారు. ఇక్కడ నిజ జీవితంలో భూ సమస్యలు చాలా చూసానని, భూ సమస్యలు చాలా బాధాకరమని, భూమికోసం ఎక్కడిదాకైనా కోట్లాడతారని,భూమికి మనిషికి మధ్య ఎమోషన్ ఉంటుందని చెప్పిన సీపీ వరంగల్ మీడియా చాలా సపోర్ట్ గా ఉండేదని అన్నారు. అధికారులు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. పవర్ ఉందని ఏదిపడితే అది చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నారు. అన్యాయానికి చెక్ పెట్టాలని, లేకంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వరంగల్ పని చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి రాజకీయ నాయకులు చాలా సపోర్ట్ చేశారని, మా అధికారులు పనితీరు బాగుందని కిదాబునిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఎక్కడైనా తప్పుడు కేసులు పెడితే సహించానని, మర్డర్ కేసులో తప్పు చేయని వారికి శిక్ష పడితే పరిస్థితి ఏంటి ? వారి కుటుంబం ఆగం కావాల్సిందే కదా, అందుకే తప్పుడు కేసుల విషయంలో తాను బాధితులకు అండగా నిలిచానని చెప్పుకొచ్చారు. వివాదాల్లో పోలీసు అధికారులు వేలు పెట్టినా వదలలేదని, వారిపై కూడా చర్యలు తీసుకున్నానని అన్నారు.
నాకు మళ్లీ అవకాశం వస్తే ఇక్కడ పనిచేయాలనుందని, ఇక్కడి ప్రజలు మంచివారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ పోలిస్ కమిషనర్ దాసరి మురళీధర్ , ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, క్లబ్ కార్యవర్గం, జర్నలిస్ట్ సంఘాల నేతలు దాసరి కృష్ణారెడ్డి, బీఆర్ లేనిన్ , గాడిపల్లి మధు, బొక్క దయాసాగర్, ఆర్వీ ప్రసాద్, సీనీయర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, ఫొటో-వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.