ఇసుక లారీల దమ్ముతో రోగాలు వస్తున్నా పట్టించుకోరా..?

అధికారులపై వీణవంక ప్రజల ఆగ్రహం

రూటు మ్యాప్ లేకున్నా లారీల రాకపోకలపై దుకాణాదారుల ఆందోళన

తెలంగాణఅక్షరం-వీణవంక

అది వీణవంక మండల కేంద్రం.. నిత్యం కరీంనగర్-వీణవంక-జమ్మికుంట ప్రధాన రహదారి.. కానీ రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవడం, ఇదే రహదారిపై వందలాది ఇసుక లారీలు వెళ్లడం.. రోడ్డు గుంతలు పడడం.. దీని పర్యావసానం దుమ్ము లేవడం.. ఆ దుమ్ముతో వందలాది మందికి శ్వాసకోశ వ్యాధులు.. నెలల తరబడి దగ్గు, జలుబు జ్వరం, ఇబ్బందులు.. వీటిని భరించలేక మండల కేంద్రానికి చెందిన ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. దీంతో వారు కోపోద్రోకులై అధికారులపై ఆగ్రహంతో శుక్రవారం ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు ఆందోళన చేయడంతో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న వీణవంక ఎస్సై ఎండీ ఆసీప్ సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి ధర్నా విరమింపచేశారు.

రోగాలు వస్తున్నాయని.. వీణవంక గ్రామస్తుల ఆందోళన

మండలంలోని కొండపాక, పోతిరెడ్డిపల్లి, చల్లూరు, కోర్కల్ తదితర గ్రామాల తీరం వెంట మానేరు తీరం ఉంది. ఇక్కడి ఇసుకకు ఫుల్ డిమాండ్ ఉండడంతో ప్రభుత్వం వాటిని గుర్తించి ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా గ్రామాల్లోని క్వారీల నుండి ఇసుకను లారీలల్లో వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే ఈ లారీలు వెళ్లడం వల్ల రోడ్లన్నీ ధ్వంసం కావడంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో దుమ్ము విఫరీతంగా లేస్తోంది. చలికాలం కావడంతో ఆ దుమ్ము గాలిలో తేమగా ఉంటూ ప్రజలకు శ్యాసకోష వ్యాధులతో బాధపడుతున్నారు. నెలల తరబడి తుమ్ములు, జలుబు, జ్వరంతో బాధపడుతూ వేల రూపాయలు దవాఖానకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. అంతే కాక కుటుంబాలు కుటుంబాలే మంచాన పడుతున్నామని ప్రజలు బాధపడుతున్నారు. కుటుంబాలు కుటుంబాలే మంచానపడినా అధికారులు పట్టించుకోరా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇసుక లారీల రవాణా చల్లూరు, మామిడాలపల్లి, మానకొండూర్ నుండి రూట్ మ్యాప్ ఉన్నా.. వీణవంక మీదుగా తరలించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో పలుమార్లు లారీలను ఆపినా అధికారులు, ఇసుక క్వారీల నిర్వాహకులు నామమాత్రంగా లారీలను నిలిపివేసి మళ్లీ వీణవంక మీదుగానే లారీలను మళ్లిస్తున్నారని వీణవంక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక లారీల రూట్ మ్యాప్ మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *