పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించాలి
తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర
తెలంగాణఅక్షరం-హైదరాబాద్/కుత్బుల్లాపూర్/ఖాజీపేట
DELHI | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే బీసీ గర్జన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తెలంగాణ సగరులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ , తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయడం కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక రైలులో దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని, ప్రస్తుతం పార్లమెంట్లో జరుగుతున్న సమావేశాలు ముగిసేలోపు బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరారు. రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే బిక్షం కాదని ఇది సామాజిక హక్కు అన్నారు. అన్ని కుల వృత్తుల పనిముట్లను ఢిల్లీలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు చట్టబద్ధతకు సహకరించిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో కూడా ఈ బీసీ బిల్లు ఆమోదం పొందేందుకు కూడా తగిన సహకారం అందించాలని కోరారు.